వికారాబాద్‌లో బీసీసీఐ అండర్-19 మహిళా క్రికెటర్ నందిని ఆత్మహత్య.. ప్రేమ వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఆరోపణలు
వికారాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ పట్టణంలోని మధు కాలనీలో యువ మహిళా క్రికెటర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఇటీవల బీసీసీఐ అండర్-19 క్రికెట్ పోటీల్లో పాల్గొన్న నందిని మృతి చెందడం క్రీడా వర్గాల్లో విషాదం నింపింది. నవంబర్ 12న సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో తన మేనమామ ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో ఆమె కనిపించింది. గమనించిన మేనమామ వెంటనే ఆమెను కిందకు దించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తమ కుమార్తెను ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో వేధిస్తున్నారని, కృష్ణ, అనిల్ అనే వ్యక్తులపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మృతురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అందులోని చాటింగ్‌లు, కాల్ వివరాలు, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫోరెన్సిక్ నివేదికలు, సేకరించిన ఆధారాల ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ కే. రఘు కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని పోలీసులు సూచించారు. పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి వ్యక్తిగత సమస్యలు, స్నేహ సంబంధాలు, చదువు, మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించాలని, ప్రేమ పేరుతో వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులు లేదా ఆన్‌లైన్ వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, ఒంటరిగా ఉండటం, నిరాశ, భయం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. పిల్లలు తమ సమస్యలను చెప్పినప్పుడు వారిని నిందించకుండా ప్రేమగా విని ధైర్యం చెప్పాలని, అవసరమైతే మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు. ప్రేమ పేరుతో ఎదుటివారిపై బలవంతం చేయడం సరికాదని, వారి నిర్ణయాన్ని గౌరవించాలని యువతకు హితవు పలికారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఆత్మహత్య పరిష్కారం కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితుల సహాయం తీసుకోవాలని సీఐ కే. రఘు కుమార్ విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు నిర్ధారణ కాని విషయాలను వాస్తవాలుగా ప్రచారం చేయవద్దని, అనుమానితులను నిందితులుగా పేర్కొనవద్దని మీడియా ప్రతినిధులకు సూచించారు.