ఆర్కేలో ఘనంగా బాలల దినోత్సవం నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు : డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణారెడ్డి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఆర్కే గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బైరాగిపట్టెడలోని వీక్ష ది స్కూల్, రంగంపేటలోని వినాయక విద్యామందిర్ లో బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్కే విమల మాట్లాడుతూ బాలల దినోత్సవం పిల్లల ప్రతిభను గుర్తించి, వారి అభిరుచులు, ఆశయాలను ప్రోత్సహించే ప్రత్యేకమైన రోజని తెలిపారు. ప్రతి విద్యార్థిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుందని, దానిని వెలికితీసేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను అలవర్చుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్కే విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ తాతిరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, “నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు” అని పేర్కొన్నారు. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, శాస్త్రవేత్తలని, వైద్యులని, ఉన్నతాధికారులని, దేశ నాయకులని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, సామాజిక బాధ్యత, మానవతా విలువలను పెంపొందించడం తమ విద్యాసంస్థల ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి చిన్నారి తన కలలను లక్ష్యాలుగా మార్చుకుని, పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, పాటలు, వేషధారణలు, ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారుల ఉత్సాహభరిత ప్రదర్శనలు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండు పాఠశాలల డైరెక్టర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్