నవంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల -పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి తేదీ -కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటరు జాబితా సవరణ ప్రక్రియ గడువును పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. నూతన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 26 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు, నవంబర్ 30న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమన్నారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ పరిధిలోని ఓటరు జాబితాలను పరిశీలించి లోపాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకుని ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు 29,890 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారని, మరో 1,335 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
విద్యార్థి దశ నుంచే ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో చునావ్ పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా భాగస్వాములై ప్రజలకు ఓటు హక్కుపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి హాబిబ్, బీజేపీ ప్రతినిధి నాగేందర్ గౌడ్, బీఆర్ఎస్ ప్రతినిధి విష్ణు సాగర్, వైఎస్సార్సీపీ ప్రతినిధి ఎం.డి. హుస్సేన్, టీడీపీ ప్రతినిధి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సందడి రవీందర్ రెడ్డి,నాగర్‌కర్నూల్,రూరల్, సూర్య న్యూస్.