బాలలు పనిలో కాదు.. బడిలో ఉండాలి
సిద్దిపేట రూరల్ :బాలలు పనిలో కాకుండా బడిలో ఉండాలని, ప్రతి ఒక్క బాలబాలికలకు విద్య ను అందించడమే లక్ష్యంగా ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోందని సంస్థ కోఆర్డినేటర్ గణేష్ అన్నారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండలం బూరుగుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రామచంద్ర నగర్ వార్డులో బడి మానేసిన బాలికలను సంస్థ ప్రతినిధులు రమేష్, మౌనిక, వీణ గుర్తించి, బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి, బూరుగుపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం స్వప్న ను సంప్రదించి బాలికలను పాఠశాలలో చేర్పించారు. అనంతరం ఎన్సాన్పల్లి జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో బాలల సంరక్షణ అధికారి రేష్మ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాల దుష్పరిణామాలు, బాల కార్మికుల హక్కులు, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడి మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించడంతో పాటు బాలల హక్కులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బాల్యవివాహాలు బాలల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, బాల కార్మిక వ్యవస్థకు దూరంగా ఉండి ప్రతి బాలుడు, బాలిక చదువుకోవాలని పిలుపునిచ్చారు. బాలల హక్కులను కాపాడుతూ వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు.