సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి -- దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -- జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్
నారాయణపేట, సూర్యన్యూస్: దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జి. వినీత్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నారాయణపేట జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం దేశవ్యాప్తంగా విడివిడిగా ఉన్న సుమారు 560 సంస్థానాలను ఏకీకృతం చేసి, ఐక్య భారతదేశ నిర్మాణానికి పునాది వేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చూపిన చొరవ, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ పటేల్ సేవలను స్మరించుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు క్రమశిక్షణ, సత్ప్రవర్తన, నైతిక విలువలను అలవర్చుకుని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో మెలుగుతూ జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించుకోవాలని, దేశ సమగ్రతను కాపాడటంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్పీ డాక్టర్ జి. వినీత్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది జాతీయ సమైక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.డి. రియాజ్ ఉల్ హక్, డీసీఆర్బీ డీఎస్పీ ఎ. మహేష్, ఆర్ఎస్ఐలు శివశంకర్, శిరీష, శివయ్య, డీపీఓ సిబ్బంది, ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.