అకాల వర్షానికి తడిసిన ధాన్యం......
మద్దూర్ …మద్దూరు మండలంలోని నర్సాయపల్లి గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు నిల్వచేసిన ధాన్యం శనివారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దయింది. సమయానికి ధాన్యంపై కప్పడానికి పరదాలు లేకపోవడంతో ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టేందుకు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చినప్పటికీ ఎన్ని బ్యాగులు లేవని కారణంతో దాన్యం కొనుగోలు చేపట్టలేదన్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం ఇలాంటి అకాల వర్షాలు వచ్చినప్పటికీ ధాన్యం తడవకుండా కప్పుకునేందుకు కొనుగోలు కేంద్రానికి వచ్చిన సుమారు 40 పరదాలు ఏ ఒక్క రైతుకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి వచ్చిన పరదాలు రైతులకు ఇస్తే ధాన్యం తడిచేది కాదని అన్నారు. పరదాలు లేక ధాన్యం రాశులపై సంచులు చీరలు కప్పాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. ఇప్పటికైనా ఐకెపి అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని కోరారు. అధికారులు ఆర్బాటంగా కేంద్రాలను ప్రారంభించి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. కరువు పరిస్థితులలో అరకొరగా అందిన ధాన్యం కూడా వర్షానికి తడిసిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు పరదాలు అందుబాటులో ఉంచాలని కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారని పలువురు రైతులు మండిపడుతున్నారు.