సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీదే హవా - స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మావే కాకాణి పూజిత
పొదలకూరు, మేజర్ న్యూస్ : సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ధీమా వ్యక్తం చేశారు. శనివారం వెంకటాచలం మండలం చవటపాలెంలో జడ్పీటీసీ అభ్యర్థి డక్కిలి వెంకట రమణమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి కుడితిపూడి వెంకటేశ్వర్లుతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు.ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.1,500, గ్యాస్ సిలిండర్ల హామీలను నెరవేర్చలేదని, రైతులు, పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. గతంలో టీడీపీకి ఓటేసిన వారే నేడు వైఎస్సార్‌సీపీ గెలవాలని కోరుకుంటున్నారన్నారు.స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం కూటమి నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పింఛన్లు, సంక్షేమ పథకాలు తొలగిస్తామని బెదిరించినా ప్రజలు భయపడరన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని తెలిపారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.