మద్దికెరలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ ఎన్నికల ప్రచారం
మద్దికెర, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా తరఫున మద్దికెర మండలంలోని పెరవలి, ఎం.అగ్రహారం గ్రామాల్లో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ శనివారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రతి గడపకూ వెళ్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గత వైకాపా ప్రభుత్వ హయాంలో అందించిన రైతు భరోసా, అమ్మఒడి, చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాల పంపిణీ, పింఛన్ల పెంపు వంటి పథకాలతో ప్రతి పేద కుటుంబానికీ లబ్ధి చేకూరిందని శ్రీదేవమ్మ ఈ సందర్భంగా వివరించారు. ఈ నెల 5న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు, పెరవలి, ఎం.అగ్రహారం గ్రామాల నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.