నిజాన్ని నిర్బంధించలేకపోయారు.. న్యాయమే గెలిచింది
- 53 రోజుల నిర్బంధం తర్వాత జనం జేజేల మధ్య చంద్రబాబు విడుదల
- ఆ రోజును జీవితంలో ఎన్నటికీ మరువలేం
- ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు
పామూరు, మేజర్ న్యూస్ :
నిజాన్ని ఎంతకాలం నిర్బంధించినా చివరకు న్యాయమే గెలుస్తుందని సీఎం నారా చంద్రబాబునాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలైన రోజు నిరూపించిందని పామూరు మండల ఎంపీపీ పువ్వాడి వెంకటేశ్వర్లు అన్నారు. తప్పుడు కేసులో అరెస్టయి 53 రోజుల పాటు నిర్బంధంలో ఉన్న చంద్రబాబు ప్రజల ఆశీస్సులు, అభిమానుల ప్రార్థనల నడుమ క్షేమంగా బయటకు వచ్చిన క్షణాలను జీవితంలో ఎన్నటికీ మరువలేమన్నారు. దార్శనిక నేతగా తెలుగు ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన చంద్రబాబును కక్షపూరిత రాజకీయాలతో నిర్బంధించినప్పటికీ ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయారని పేర్కొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా నిలవడం ఆయనపై ఉన్న అపారమైన నమ్మకానికి నిదర్శనమన్నారు. ప్రజల విశ్వాసం, అభిమానుల ప్రార్థనలతో నిలువెత్తు తెలుగు సంతకమైన చంద్రబాబు జనం జేజేల మధ్య జైలు నుంచి బయటకు వచ్చిన రోజు తెలుగు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పువ్వాడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.