చార్మినార్, మేజర్ న్యూస్:హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నప్పటికీ, నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ కనీస మౌలిక వసతుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) హైదరాబాద్, రంగారెడ్డి,మహబూబ్‌నగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాష్ కొల్లూరు పేర్కొన్నారు. నగర అభివృద్ధి అంటే కేవలం ఎత్తైన భవనాలు, ఐటీ కంపెనీలు, ఫ్లైఓవర్ల నిర్మాణం మాత్రమే కాదని, ప్రతి కాలనీలో నాణ్యమైన రహదారులు, సమర్థవంతమైన డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యం, తాగునీరు, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మంగళవారం నాడు హైదరాబాద్ పాతబస్తీలోని రాజన్న బావి నందుగల లోటస్ బ్యాంక్వెట్ హాల్ లో టిఆర్ఎస్ చార్మినార్ నియోజకవర్గ ఇంచార్జి పుప్పాల రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆకాష్ కొల్లూరు మాట్లాడారు. ముఖ్యంగా నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, భారీ నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. నానక్‌రామ్‌గూడ నుంచి పాతబస్తీ వరకు సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ సమగ్ర పట్టణాభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని ఆకాష్ కొల్లూరు విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ నుంచి ఐటీ కారిడార్ వరకు, నగర కేంద్రం నుంచి శివారు ప్రాంతాల వరకు అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు పాల్గొన్నారు. వారిలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రఘు (కోరుట్ల అసెంబ్లీ ఇంచార్జి ), మహేందర్ భండారి (సికింద్రాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి), టి.పరమేశ్వరి రాకేష్ గైక్వాడ్ , రాధాకృష్ణ, వికాస్ గౌడ్, మణికొండ విజయ్ కుమార్, అంబటి రాజేష్, భాను, సయ్యద్ మతీన్ ,మీర్ హమీద్ అలీ తదితరులు పాల్గొన్నారు.