*మట్టి ప్రమిదల వెలుగుల్లోనే అసలైన దీపావళి!*
కోహిర్;దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతి ఇంటినీ మట్టి ప్రమిదల వెలుగులతో అలంకరించుకుందామని, చిరు వ్యాపారులకు అండగా నిలుద్దామని పలువురు సూచిస్తున్నారు. సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మట్టి దీపాలను కొనుగోలు చేసి, పర్యావరణ పరిరక్షణతో పాటు స్థానిక చేతివృత్తుల వారికి చేయూత అందించాలని పిలుపునిస్తున్నారు.దీపావళి సందర్భంగా రోడ్ల పక్కన, మార్కెట్లలో మట్టి ప్రమిదలను విక్రయిస్తూ కుమ్మరి కుటుంబాలకు చెందిన చిన్న వ్యాపారులు ఉపాధి పొందుతున్నారు. ఏడాది పొడవునా కష్టపడి తయారు చేసిన ప్రమిదలను పండుగ సమయంలో విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయమే అనేక కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోంది. అలాంటి వారి వద్ద దీపాలను కొనుగోలు చేయడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితికి కొంతమేర అండగా నిలిచినవారమవుతాం.ప్లాస్టిక్‌తో తయారైన అలంకరణ వస్తువులు, విద్యుత్ దీపాలకు బదులుగా సంప్రదాయ మట్టి ప్రమిదలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పర్యావరణహిత పండుగకు తోడ్పడటంతో పాటు స్థానిక కళాకారులను ప్రోత్సహించినవారమవుతాం. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ చేతివృత్తుల వారికి ఉపాధి కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.ఈ దీపావళికి ప్రతి ఇంటా మట్టి ప్రమిదలు వెలగాలి.. ప్రతి చిరు వ్యాపారి ముఖంలో చిరునవ్వు కనిపించాలి. మన ఇంట్లో వెలిగించే ప్రతి మట్టి దీపం మరో కుటుంబానికి జీవనోపాధికి దోహదపడాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, స్థానిక వ్యాపారులకు అండగా నిలిచినప్పుడే దీపావళి పండుగకు నిజమైన అర్థం చేకూరుతుంది.