ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి!
వజ్రపుకొత్తూరు, సూర్య : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడంతో పాటు, గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) ఈవీ నరేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం వజ్రపుకొత్తూరు మండలంలోని గోవిందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ రికార్డులను పరిశీలించి, వైద్య సేవల నిర్వహణ, సిబ్బంది పనితీరు, ఆసుపత్రిలో ఎదురవుతున్న సమస్యలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గర్భిణులకు ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకం కల్పించి, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే గోవిందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అవసరమైన ప్రత్యేక పరికరాలు అందుబాటులో ఉన్నందున వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇటీవల తుఫాను ప్రభావం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, అత్యవసర సమయాల్లోనూ సకాలంలో వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్, ఈవో సన్యాసిరాజు, ఫార్మసిస్ట్ సుబ్రహ్మణ్యం, స్టాఫ్ నర్సులు, ఎం ఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.