జోరువానలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి.
బిక్కవోలు, మేజర్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో మంగళవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు కోరారు.ఈ సందర్భంగా బిక్కవోలు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొవ్వూరి సుజాత వెంకటరామారెడ్డిని, తొస్సిపూడి ఎంపీటీసీ అభ్యర్థి తేతలి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా పాలన సాగించారని గుర్తుచేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.