andhrapradesh
విజయవాడ, గుంటూరులకు దీటుగా తెనాలి అభివృద్ధి చేస్తాం.... నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర
తెనాలి, న్యూస్ : విజయవాడ, గుంటూరు నగరాలకు దీటుగా తెనాలి పట్టణ అభివృద్ధి కృషి చేస్తానని నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. జనసేన పిఏసి చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో తెనాలి పట్టణాన్ని మహానగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తనకు చైర్మన్ గా పోటీచేసే అవకాశం కల్పించి, గెలుపుకు కృషి చేసిన మంత్రి మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి, కేంద్ర మంత్రి పెమ్మసాని లకు ఋణపడి ఉంటానని అన్నారు. తనతో పాటు కూటమి అభ్యర్థులకు అత్యధిక విజయం చేకూర్చిన పట్టణ ప్రజానికానికి కృతజ్ఞతలు తెలిపారు. తన విజయం ప్రజల విజయంగా అభివర్ణించారు. పట్టణంలో పారిశుధ్య మెరుగుదల, ఆయా వార్డుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ తోటకూర వెంకట రమణరావును కూటమి నాయకులు సత్కరించారు.
మంత్రి నాదెండ్లను కలిసిన చైర్మన్, కౌన్సిలర్లు........ తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి చైర్మన్ తోటకూర వెంకట రమణారావు, కౌన్సిలర్ అభ్యర్థులు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ను తెనాలిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ, ఎన్నికల్లో తమకు సహకరించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తెనాలి అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని చెప్పారు.