telangana
నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులకు అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Telangana
03 Nov 2026
85 views
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి ;రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడం, భూగర్భ జలాల మట్టం పడిపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం మందిరంలో వ్యవసాయ, నీటిపారుదల, ఉద్యానవన తదితర సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో యాసంగి పంటల ప్రణాళిక, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటల సాగుపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నీటి వనరులు పరిమితంగా ఉన్నందున అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో అధిక దిగుబడి, ఆదాయం పొందగలిగే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పెసర, మినుములు, కందులు వంటి పప్పుధాన్యాలు, సూర్యకాంతి, వేరుశనగ, నువ్వులు వంటి నూనెగింజలు, జొన్న, సజ్జ, మొక్కజొన్న వంటి చిరుధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని తెలిపారు.
గ్రామ, మండల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు సరైన మార్గదర్శనం చేయాలని ఆదేశించారు. ప్రతి అధికారి రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఆయిల్‌పామ్, కూరగాయల వంటి ఉద్యానవన పంటల సాగుతో తక్కువ నీటిని వినియోగిస్తూ మెరుగైన ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రైతులకు బిందు సేద్య పరికరాలు, విత్తనాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీలను అర్హత, నిబంధనల ప్రకారం అందేలా చూడాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు.
సాగుభూమి సంరక్షణకు సంబంధించి అమలు చేస్తున్న 'ఖేత్ బచావో అభియాన్'తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు, రాయితీల వివరాలను ప్రతి రైతుకు చేరవేయాలన్నారు. పశువులకు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా పశుగ్రాస పంటల సాగును కూడా ప్రోత్సహించాలని సూచించారు.
రైతు బీమా పరిహారం పొందడంలో రైతు కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తహసీల్దార్లు మరణ ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలను ఎలాంటి జాప్యం లేకుండా మంజూరు చేయాలని ఆదేశించారు.
నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ముందస్తు ప్రణాళికతో పంటల ఎంపిక చేసుకోవాలని, నీటి అవసరం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసి ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారిని జ్యోతి, గిరిజన శాఖ అధికారి సౌజన్య, డి ఆర్ డి ఓ దామోదర్ రెడ్డి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఏడీఏలు, అధికారులు, అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
News