సబ్బవరం పరిషత్ ఎన్నికల్లో సీట్ల వివాదం... టీడీపీ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల
పెందుర్తి , సూర్య : రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం శుభ పరిణామమని, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పోటీ చేసిన నాలుగు స్థానాల్లోనూ విజయం సాధించినట్లు ఆయన వెల్లడించారు.
మంగళవారం సబ్బవరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన జరగనున్న పరిషత్ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒప్పందానికి విరుద్ధంగా బి-ఫారాల కేటాయింపు :
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని పెందుర్తి, సబ్బవరం, పరవాడ మండలాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు చెరో సగం స్థానాల్లో, అలాగే బీజేపీకి ఒక స్థానం చొప్పున కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. టీడీపీ ఇన్చార్జ్ గండి బాబ్జి, యువనాయకుడు వంశీలతో కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని ప్రకారం సబ్బవరం మండలంలో టీడీపీ 9, జనసేన 9, బీజేపీ 1 చోట పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నామని వివరించారు.
అయితే, దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ ఒప్పందాన్ని విస్మరించి సబ్బవరంలో 13 చోట్ల అభ్యర్థులకు బి-ఫారాలు ఇవ్వడం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. ఈ చర్య వల్ల ప్రత్యర్థులకు ప్రయోజనం చేకూరి, కూటమి ధర్మానికి విఘాతం కలుగుతుందని, ఫలితంగా ప్రతిపక్షం బలాన్ని పుంజుకునే అవకాశం ఉందని వాపోయారు.
అధిష్టానానికి విన్నవించినా స్పందన లేదు :
ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు తాతయ్య బాబుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విచారకరమని తెలిపారు.
సబ్బవరం ఎంపీపీ అభ్యర్థిగా టీడీపీ ఇన్చార్జ్ గండి బాబ్జి కుమారుడు వంశీ పోటీలో ఉన్నందున, కూటమి విజయం టీడీపీకి చాలా కీలకమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వంశీకి ఏమైనా నష్టం జరిగితే అది కూటమి మొత్తానికి జరిగిన నష్టంగా భావించాల్సి వస్తుందన్నారు.
అదనపు అభ్యర్థులను విత్ డ్రా చేసుకోవాలి:
ఇప్పటికైనా టీడీపీ అధినాయకత్వం, స్థానిక నాయకులు చొరవ తీసుకుని, పొత్తు ధర్మాన్ని పాటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. సబ్బవరం మండలంలో అదనంగా నిలబెట్టిన 4 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను వెంటనే తప్పించి, కూటమి అభ్యర్థులందరి విజయం కోసం సహకరించాలని మీడియా ముఖంగా కోరారు. అలా కాకుండా అదనపు అభ్యర్థులను రేసులో ఉంచితే భవిష్యత్తులో కూటమిలో విభేదాలు పొడచూపే అవకాశం ఉందని, ఆ పరిణామాలకు తెలుగుదేశం పార్టీ నాయకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.