మరోసారి అధికారం కోసమే బీజేపీ ఓట్ల తొలగింపు నాటకం -- సర్ ప్రక్రియ కొత్తేమీ కాదు.. ఈ సరే ప్రత్యేకం -- పేదోడి ఓటును కాపాడితేనే రాజ్యాంగ పరిరక్షణ -- నవంబర్ 1న ఛలో ఢిల్లీకి తరలిరావాలి -- ఓట్ బచావో–దేశ్ బచావో’ సభను విజయవంతం చేద్దాం -- పట్టభద్రుల ఎమ్మెల్సీగా సామా రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలి -- మంత్ర
*నారాయణపేట, సూర్యన్యూస్* : కేంద్రంలో మరోసారి అధికారాన్ని చేపట్టాలని కుటిల ఆలోచనతో బీజేపీ ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపడుతుందని రాష్ట్ర క్రీడలు, పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. నారాయణపేటలో సోమవారం డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన‘ఓట్ బచావో–దేశ్ బచావో’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘంతో కలిసి బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని మంత్రి విమర్శించారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించడం ద్వారా లబ్ధి పొందవచనే ఆలోచన చేస్తుందన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ పేరుతో కోట్లాది ఓట్లను తొలగిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియ కొత్తేమీ కాదని ప్రతి 20 ఏళ్లకు ఒకసారి జరుగుతుందని, కాకపోతే ఈ సరే ప్రత్యేకమని అన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపునకు అవకాశం కల్పించే విధానాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా తన హక్కును కోల్పోకూడదని స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించిందని గుర్తుచేశారు. ఓటు వేయడం కేవలం పౌర బాధ్యత మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేసే శక్తిమంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ఓటు హక్కు కోల్పోతే ప్రజాస్వామ్య ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యం దెబ్బతింటుందని అన్నారు. ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాల ఓటు హక్కును పరిరక్షించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలని పిలుపునిచ్చారు.ప్రజల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, సంక్షేమం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యాలని మంత్రి తెలిపారు. ప్రజల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వాలు వారికి జవాబుదారీగా ఉండాలని, ఓటు హక్కుకు విఘాతం కలిగించే ప్రయత్నాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలని అన్నారు.
*ఢిల్లీ నిరసన సభను విజయవంతం చేయాలి*
ఓటు హక్కుల పరిరక్షణ కోసం నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ‘ఓట్ బచావో–దేశ్ బచావో’ నిరసన సభకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఓటు హక్కు ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించి, ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కులగణన చేపట్టి సామాజిక న్యాయం దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధైర్యంగా ముందడుగు వేశారని కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలంటే వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన సమాచారం అవసరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం, సమాన అవకాశాల లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు. పేదలు, బడుగు బలహీన వర్గాల ఓటు హక్కును కాపాడుకోవడం ద్వారానే భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోగలమని అన్నారు.
*ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే లక్ష్యం*
రాబోయే పాలమూరు – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సామా రామ్మోహన్‌రెడ్డిని గెలిపించే బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని మంత్రి శ్రీహరి అన్నారు. అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడం, కాంగ్రెస్ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయడం ద్వారా లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు రవీందర్ దాస్, డిసీసీ అధ్యక్షులు కె.ప్రశాంత్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, జిల్లా నాయకులు వకీల్ సంతోష్ కుమార్, బండి వేణుగోపాల్, పట్టణ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, ఆర్టిఏ సభ్యులు పోషల్ రాజేష్ పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.