జాతీయ స్థాయి మల్లకంభ పోటీలకు విజ్ఞాన విహార విద్యార్థులు
ఆనందపురం, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని ఎం.ఆర్.కె. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మల్లఖంబ్ పోటీల్లో గుడిలోవ విజ్ఞాన విహార పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ వయో విభాగాల్లో సత్తా చాటి మొత్తం 14 మంది విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
14 ఏళ్లలోపు బాలబాలికల విభాగాల్లో ఆరుగురు, 17 ఏళ్లలోపు విభాగాల్లో ఐదుగురు, 19 ఏళ్లలోపు బాలుర విభాగంలో ముగ్గురు విద్యార్థులు జాతీయస్థాయికి అర్హత సాధించారు. వీరంతా నవంబరు 24 నుంచి 27వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.
రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థులను విజ్ఞాన విహార పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.