మహిళ కన్నీటికి చలించిన ఎమ్మెల్యే చింతమనేని -- అట్లతద్ది వాయినాల సరుకుల కోసం తెచ్చుకున్న రూ. 20 వేలు పోగొట్టుకున్న ఆమెకు కొండంత అండ
ఏలూరు, మేజర్ న్యూస్ :శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మరోసారి తన ఉదారతను, మానవత్వాన్ని చాటుకున్నారు. నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం లోపూడి గ్రామానికి చెందిన చలమాల రాజేశ్వరి అనే మహిళ అట్లతద్ది పండుగ రానున్న నేపథ్యంలో వాయినాల కార్యక్రమానికి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ఇంటి వద్ద నుంచి 20 వేల రూపాయల నగదుతో బస్సులో ఏలూరుకు బయలుదేరారు. అయితే ఏలూరు కండ్రికగూడెం సెంటర్ వద్ద బస్సు దిగే సమయంలో, పక్కనే కూర్చున్న గుర్తుతెలియని వ్యక్తులు ఆమె బ్యాగులో ఉన్న 20 వేల నగదును చాకచక్యంగా దొంగిలించారు. డబ్బులు పోయిన విషయం గుర్తించి తీవ్ర ఆందోళనతో కన్నీరుమున్నీరవుతూ ఆమె సమీపం లోని ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ అక్కడి సిబ్బంది చెప్పటంతో, ఆమె తీవ్ర నిస్సహాయ స్థితిలో ఆందోళన చెందుతూ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ చేసి తన గోడును వెళ్లబోసుకున్నారు.పండుగ వేళ మహిళ పడుతున్న బాధను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే చింతమనేని తక్షణమే ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా చేరుకున్నారు. అన్యాయం జరిగి స్టేషన్‌కు వచ్చిన పేదలను పరిధుల పేరుతో తిప్పిపంపడం సరికాదని, వారికి సాంత్వన చేకూర్చేలా వ్యవహరించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. అనంతరం స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే.. బస్సు ప్రయాణ సంబంధిత సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను తక్షణమే పరిశీలించి కేసు నమోదు చేసి నిందితులను పట్టుకోవాలని కోరారు. కేవలం పోలీసులకు సూచనలు చేయడమే కాకుండా.. పండుగ సరుకుల కోసం తెచ్చిన సొమ్ము పోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్న ఆ మహిళను ఓదారుస్తూ, తన వ్యక్తిగతంగా జేబులోంచి 20 వేల రూపాయల నగదు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే ఆమెకు అందజేశారు. పోలీసులు కేసు ఛేదించి సొమ్ము రికవరీ చేసిన తర్వాత తన డబ్బులు తిరిగి ఇవ్వవచ్చని, ముందుగా వెళ్లి సరుకులు కొనుక్కోవాలని భరోసా ఇచ్చారు. తన నియోజకవర్గం కాకపోయినా, గతంలో ఎన్నడు ఆయనతో ముఖ పరిచయం లేకపోయినా, ఎవరో చెప్పిన సలహా మేరకు సహాయం కోరగా, ఆపద సమయంలో పెద్దదిక్కులా నిలిచి కన్నీరు తుడిచిన ఎమ్మెల్యే చింతమనేనికి బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు