telangana
మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ మెరుపు దాడులు - నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కలకలం - బందోబస్తు మధ్య కొనసాగిన తనిఖీలు.
సూర్య ఖానాపూర్ : ఖానాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో పక్కా ప్రణాళికతో చేరుకున్న ఈడీ బృందం నివాసంలో విస్తృతంగా సోదాలు జరిపారు. ఈ తనిఖీల వెనుక గల కారణాలపై స్థానికంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రేఖా నాయక్ అక్రమ ఆస్తుల వ్యవహారంలో ఈ విచారణ జరుగుతోందని కొందరు విశ్లేషిస్తుండగా, మరికొందరు 'ఏఆర్ఎస్' పేరుతో నిర్వహిస్తున్న రైస్ మిల్లులో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ దృష్టి సారించిందని అభిప్రాయపడుతున్నారు.సోదాల విషయం తెలుసుకున్న రేఖా నాయక్ అనుచరులు, అభిమానులు ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు. అయితే, ఈడీ అధికారులు ముందస్తు జాగ్రత్తగా ప్రత్యేక బలగాలను మొహరించి, ఇంటి పరిసరాల్లోకి ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.ఈ అనూహ్య పరిణామం ఖానాపూర్ పట్టణంతో పాటు నిర్మల్ జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. ధాన్యం లెక్కల్లో తేడాలు, ప్రభుత్వ ధాన్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే అంశాలపై అధికారులు దృష్టి చారించారు. ఈ కేసు విచారణలో కోట్ల రూపాయలు విలువచేసే దాన్యం మాయమైనట్టు అధికారులు గుర్తించారు. గత ఆగస్టు నెలలో ఈ విషయమై రేఖా నాయక్ పై ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రేఖ నాయక్ ఇంటికి విజిలెన్స్ అధికారులు, పోలీసు బలగాలు చేరుకోవడంతో ఖానాపూర్ లో పోలీసులు మోహరించడంతో స్థానికంగా ఈ విషయం కలకలం రేపింది.
-ఈ.డి సోదాలపై రేఖ నాయక్ వివరణ :
సుమారు 10 గంటల పాటు ఈ.డి సోదాల విచారణ అనంతరం రేఖా నాయక్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేఖ నాయక్ మాట్లాడుతూ, నేను పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో రైతులను గాని ప్రజలను ఎలాంటి మోసం చేయలేదని, ఎఆర్ఎస్ రైస్ రైస్ మిల్ తన పేరు మీద ఉందని ,అంతేకానీ ఆ రైస్ మిల్ కు సంబంధించిన విషయాల మీద కొంత వరకు అవగాహన లేదని ఈ సందర్భంగా రేఖ నాయక్ అన్నారు. అధికారులు రైస్ మిల్లు సంబంధించి అన్ని పత్రాలను పరిశీలించారని, తన ఇంట్లో ఎలాంటి అవినీతి సొమ్ము లేదని కేవలం 200 రూపాయలు మాత్రమే వారికి దొరికాయి అని, అవి కూడా తిరిగి తనకు ఇచ్చేసి ఆదికారులు వెళ్లారని రేఖ నాయక్ అన్నారు . చెల్లించాల్సింది 40 కోట్లు
కాదని కేవలం 12 కోట్లని, దానికి సంబంధించిన పెనాల్టీ అన్నీ కలుపుకొని సుమారుగా 20 నుంచి 25 కోట్ల వరకు ఉంటుందని అంతేకానీ 40 కోట్లు కాదని రేఖా నాయక్ అన్నారు. ఈ కేసు కోర్టులో విచారణలో ఉందని ప్రభుత్వానికి సంబంధించిన అమౌంట్ ను పూర్తిగా చెల్లిస్తామని అన్నారు.