క్రీడాకారులను ప్రోత్సహించాలి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి: కాటా శ్రీనివాస్ గౌడ్
పటాన్‌చెరు : యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల పెంపొందించడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని, మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.పటాన్‌చెరు మండలం భానూర్ గ్రామంలోని స్నేహ ఫంక్షన్ హాల్‌లో పవర్ డ్రాగన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు ఘనంగా నిర్వహించారు. అకాడమీ చైర్మన్ గోపాల్ యాదవ్ సారథ్యంలో జరిగిన ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరై ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీలను ప్రారంభించి, విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల్లో ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. నేటి యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర స్థాయి పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఇలాంటి పోటీల నిర్వహణ అభినందనీయమని, క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.