గిరిజనుల ఆత్మగౌరవ పోరాట యోధుడు బిర్సా ముండా ఘనంగా 151వ జయంతి వేడుకలు.. జనజాతీయ గౌరవ దివస్ నిర్వహణ
సంగారెడ్డి, ప్రతినిధి : గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు భగవాన్ ధర్తి ఆబా బిర్సా ముండా అని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రామేశ్వరీ దేవి అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి, త్యాగాలు భావితరాలకు ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి, జనజాతీయ గౌరవ దివస్ వేడుకలను ఆదివారం సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం బొమ్మారెడ్డిగూడెం గ్రామంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రామేశ్వరీ దేవి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. స్థానిక వార్డు సభ్యురాలు భవాని కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టిన విద్యార్థుల ప్రదర్శనలు…
నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) అధికారుల సహకారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, గ్రామ ప్రజలు వీక్షించారు. అనంతరం విద్యార్థులు ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, జీవన విధానాలను ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రదర్శించారు. విద్యార్థుల ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గిరిజన వీరుల చరిత్రను భావితరాలకు తెలియజేయాలి…
ఈ సందర్భంగా రామేశ్వరీ దేవి మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా గిరిజనుల హక్కుల సాధన కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. గిరిజనుల ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.గిరిజన సమాజానికి చెందిన మహనీయుల చరిత్రను, వారి త్యాగాలను, గొప్ప వారసత్వాన్ని నేటి యువతకు తెలియజేయడమే జనజాతీయ గౌరవ దివస్ వేడుకల ప్రధాన ఉద్దేశమని వివరించారు. గిరిజన సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది ఏ.డి. స్వాతి, రవీందర్, గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్, ఉపసర్పంచ్ రజనీబాయి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గిరిజన నాయకులు, ఇతర గ్రామాలసర్పంచులు,ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ సంక్షేమ అధికారులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.