పెద్దాపూర్ గుట్టపై ప్రోక్లెయినర్ విధ్వంసం! - అధికారుల పర్యవేక్షణ ఏదీ?
సూర్య – జూలపల్లి
జూలపల్లి మండల కేంద్రంలో రూ.4.82 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రెండు వరుసల రహదారి పనుల కోసం పెద్దాపూర్ శివారులోని గుట్టను ప్రోక్లెయినర్లతో తవ్వుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో సహజ వనరులను ఇష్టారాజ్యంగా తవ్వుతూ, అడ్డుగా ఉన్న చెట్లను సైతం తొలగిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అక్టోబర్ 27 నుంచి నవంబర్ 15 వరకు ప్రతిరోజూ సుమారు 8 నుంచి 10 టిప్పర్లతో గుట్ట మట్టిని తరలిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో గుట్ట తవ్వకాలకు గురైనట్లు చెబుతున్నారు. ఇంత పెద్దఎత్తున తవ్వకాలు జరుగుతున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుట్ట తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అభివృద్ధి పనుల మాటున ప్రకృతి సంపద విధ్వంసం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.