శివకేశవులకు ప్రీతిపాత్రమైన కోటి సోమవారం
పరమపవిత్రమైన కార్తీక మాసంలో తొలి సోమవారంతో పాటే నవంబర్ 16న 'కోటి సోమవారం' కలిసిరావడం విశేషంగా మారింది. కార్తీక శుక్ల పక్షంలో సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం, సోమవారం కలయికతో కోటి సోమవారం ఏర్పడుతుందని పంచాంగకర్తలు పేర్కొంటున్నారు.సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే కోటి సోమవారం నాడు ఆచరించే స్నానం, దానం, జపం, దీపారాధన కోటి రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తాయని పండితులు వివరిస్తున్నారు. శ్రవణ నక్షత్రం మహావిష్ణువుకు, సోమవారం పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కావడంతో ఈ పర్వదినాన్ని శివకేశవులిద్దరికీ అత్యంత ఇష్టమైన రోజుగా భక్తులు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.
కోటి సోమవారం సందర్భంగా భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కార్తీక స్నానం ఆచరించి, సమీపంలోని శివాలయాలకు వెళ్లి పరమేశ్వరునికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం ప్రదోష కాలంలో ఇంట్లోని పూజా మందిరంతో పాటు దేవాలయాల్లో దీపారాధన చేసి, 'ఓం నమఃశివాయ' పంచాక్షరి మంత్రాన్ని జపించడం శుభప్రదమని పండితులు సూచిస్తున్నారు.ఉపవాస దీక్ష చేపట్టే భక్తులు పగలంతా నిరాహారంగా ఉండి, సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి భోజనం చేస్తారు. శక్తి మేరకు ఏకభుక్తం పాటించడం, ఆకాశదీప దర్శనం, దానధర్మాలు చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. కార్తీక తొలి సోమవారం కావడంతో శైవ, వైష్ణవ క్షేత్రాలు భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.