అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు
నెల్లూరు వేదాయపాలెం స్వామి అయ్యప్ప దేవస్థానంలో వేదశాస్త్ర అయ్యప్ప స్వామి 40వ వార్షిక కేరళ సంప్రదాయ మండల పూజలు నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దేవస్థానం అధ్యక్షులు గూడల శేషగిరిరావు తెలిపారు. ఆదివారం దేవస్థానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గూడల శేషగిరిరావు, కార్యదర్శి కత్తుల వెంకటరత్నం, సభ్యులు పావళ్ళ ప్రసాద్, పసుపులేటి అశోక్ చంద్ర కలిసి మండల పూజల కరపత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం గూడల శేషగిరిరావు మాట్లాడుతూ నవంబర్ 16వ తేదీ సోమవారం ఉదయం నూతన ఉత్సవ పంచలోహ విగ్రహ ప్రాణప్రతిష్ఠ, శతకలశాభిషేకం నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజు సాయంత్రం మండల పూజల కొడియెట్టం (ధ్వజారోహణం), తదుపరి తొలి పడిపూజ జరగనున్నాయని వెల్లడించారు.
నవంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు అయ్యప్ప స్వామికి కేరళ సంప్రదాయ త్రికాల పూజలు, వేలి ఉత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 28వ తేదీన నగరోత్సవం, డిసెంబర్ 29వ తేదీన ఆరాట్టు (అయ్యప్ప స్వామికి కోనేటి స్నానం) కార్యక్రమాలతో మండల పూజలు ముగుస్తాయని వివరించారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములకు, భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం జరుగుతాయని పేర్కొన్నారు. మండల పూజలు, అన్నదాన కార్యక్రమాలు దాతల సహకారంతోనే జరుగుతున్నాయని, భక్తులు పాల్గొని స్వామి కృప పొందాలని ఆయన కోరారు.