నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి!
నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి!
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం మండల కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నన్నూరు గ్రామం బంగ్లా ఏరియాలో రైతు సంఘం జెండాను మండల అధ్యక్షుడు ఎస్. మధుసూదన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి. నాగన్న మాట్లాడుతూ మహాసభలకు దేశవ్యాప్తంగా రైతు సంఘం నాయకులు, ప్రతినిధులు హాజరవుతారని, బహిరంగ సభకు లక్ష మంది పాల్గొననున్నారని తెలిపారు. బృందాకరత్, రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ తదితర జాతీయ నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, కౌలు రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలపై మహాసభల్లో చర్చించి, రాబోయే మూడేళ్ల ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు కల్పిస్తూ రైతులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. రైతుల రుణాలు తక్షణమే రద్దు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కౌలు రైతులకు బేషరతుగా బ్యాంకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు తగ్గించి వ్యవసాయాన్ని రక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు ఆర్. మహేష్, టి. మల్లేష్, బొజ్జన్న, బషీర్, రామాంజనేయులు, నారాయణ, నరసింహులు, వాయిస్ భాష తదితరులు, రైతులు పాల్గొన్నారు.