మానవ సేవే.. సాయికి నిజమైన నివాళి
గాజువాక, మేజర్ న్యూస్ : మానవ సేవే మాధవ సేవ అన్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశయాలకు అనుగుణంగా, ఆయన జయంతి వేళ నిరుపేదలకు అండగా నిలవడమే అసలైన నివాళి అని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. పెదగంట్యాడ సమీపంలోని వెంపల్‌నగర్ భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని, 400 మంది పేదలకు ‘అమృత కలశాలను’ పంపిణీ చేశారు. మండలి అధ్యక్షుడు గల్లా శంకర్ సాయిరామ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఒక్కో కుటుంబ అవసరాలకు సరిపడా 45 రకాల నిత్యావసర సరకులతో పాటు వంట పాత్రలు, ఇతర గృహోపకరణాలను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. ప్రేమ, సేవ, త్యాగం, మానవత్వం అనే సత్యసాయిబాబా బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేయూతనిస్తూ భజన మండలి సభ్యులు చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవలను మరింత విస్తృతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, కార్పొరేటర్లు ప్రసాదుల సునీత శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : పీ.కోటిరెడ్డి, గాజువాక, విశాఖపట్నం