telangana
కొమురం భీం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి... ఆదివాసీ సంఘాల నాయకులు
సూర్య, పెంచికల్‌పేట్:జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన ఆదివాసీ వీరుడు కొమురం భీమ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆయన 86వ వర్ధంతి సందర్భంగా పెంచికల్ పేట్ మండలం జిల్లెడ, మురళీగూడ గ్రామాల్లో జెండా ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు జీవో 49ను వెంటనే రద్దు చేయాలని, అటవీ హక్కుల చట్టం-2006ను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ జనాభా అధికంగా ఉన్న గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించి, 29 శాఖల్లో సమాన ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, మంజూరైన రోడ్ల నిర్మాణాలకు అటవీ అధికారులు అడ్డంకులు సృష్టించవద్దని కోరారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్షుడు తలండి మధుకర్, మురళీగూడ సర్పంచ్ పోర్తేటి వెంకటేష్, గ్రామ అధ్యక్షులు గురుదాస్, సంజీవ్, ఆదివాసి నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.