telangana
కాంగ్రెస్ బలోపేతం, జిల్లా అభివృద్ధిపై సమీక్ష
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్తో పాటు మాజీ ఎంపీ శ్రీ సోయం బాబూరావు , మాజీ మంత్రి శ్రీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీ ఆడే గజేందర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ మల్లెపూల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, పార్టీ శ్రేణులను సమన్వయంతో ముందుకు నడిపించడం, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం వంటి పలు కీలక అంశాలపై నాయకులు విస్తృతంగా చర్చించారు. త్వరలో ప్రకటించనున్న నామినేటెడ్ పదవుల నియామకాల విషయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న అర్హులైన నాయకులు, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. అలాగే, జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను నాయకులు ప్రస్తావించారు. జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై చర్చిస్తూ.. జిల్లాకు అవసరమైన నిధులు మంజూరు చేయడానికి తగిన సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాను అన్ని రంగాల్లోనూ మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు పార్టీ నాయకులంతా ఐక్యంగా కృషి చేస్తున్నట్లు ఈ సమావేశంలో స్పష్టం చేశారు.