ప్రజావాణికి 33 దరఖాస్తులు.. ఎఫ్‌ఆర్‌ఎస్ అమలులో నిర్లక్ష్యం వద్దు -ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవసహాయం, డీఆర్‌ఓ పండుతో కలిసి కలెక్టర్ స్వీకరించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 33 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమర్పించిన దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యతనిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు.జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ (FRS) విధానాన్ని 100 శాతం అమలు చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని శాఖల్లో ఈ విధానం పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎఫ్‌ఆర్‌ఎస్ అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. విధుల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ఈ సందర్భంగా శాఖల వారీగా రోజువారీ హాజరును సమీక్షించిన కలెక్టర్, కొన్ని శాఖల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి శాఖలో సిబ్బంది విధిగా 100 శాతం ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సందడి రవీందర్ రెడ్డి, నాగర్ కర్నూల్, రూరల్ సూర్య న్యూస్.