కళాకారుల ఐక్యతే మన బలం
జిన్నారం;తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ, తెలంగాణ ఫోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 3న సిరిసిల్ల పట్టణ కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని తెలంగాణ సాంస్కృతిక సారధి, జిన్నారం మండల జానపద కళాకారుడు మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రతి కళాకారుడు భాగస్వామై తన వంతు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా సోమవారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో మల్లేష్ మాట్లాడుతూ.. కళాకారుల ఐక్యతే మన బలమని, ఐకమత్యంతోనే హక్కులను సాధించుకోగలమని అన్నారు. కళాకారుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనతో పాటు భవిష్యత్ తరాల కళాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు అందరూ సంఘటితంగా ముందుకు సాగాలని సూచించారు. నవంబర్ మూడో తారీకు సిరిసిల్లలో నిర్వహించనున్న వేడుకలు ఎవరో కొందరికి సంబంధించిన కార్యక్రమం కాదని, ప్రతి కళాకారుడి కార్యక్రమమని పేర్కొన్నారు. కార్యక్రమ విజయానికి ప్రచారాన్ని విస్తృతం చేయడంతో పాటు కళాకారులందరూ చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎవరో ముందుకు వస్తారని ఎదురుచూడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా భావించి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కళాకారుల గొంతుకు గుర్తింపు రావాలన్నా, వారి జీవితాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకోవాలన్నా ఐక్యత ఎంతో అవసరమని మల్లేష్ అన్నారు. మన కళ కోసం, మన హక్కుల కోసం, కళాకారుల భవిష్యత్తు కోసం అందరూ ఏకమై నవంబర్ 3న సిరిసిల్లలో తమ ఐక్యతను చాటాలని తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ, తెలంగాణ ఫోక్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ తరఫున విజ్ఞప్తి చేశారు.