హోమ్ ›
andhrapradesh ›
స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీస...
andhrapradesh
స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా లాడ్జిల్లో పోలీసుల తనిఖీలు - చిత్తూరు 2 టౌన్ పరిధిలో లాడ్జిలను తనిఖీ చేసిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం - రిజిస్టర్లు, గుర్తింపు పత్రాల పరిశీలన
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు సోమవారం లాడ్జిలు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, అక్రమ నగదు, మద్యం రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ హషం తన పరిధిలోని లాడ్జిలను తనిఖీ చేసి, బస చేస్తున్న వ్యక్తుల వివరాలు, గుర్తింపు పత్రాలు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. లాడ్జి నిర్వాహకులు ప్రతి ఒక్కరి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ హషం మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినా, అక్రమ నగదు, మద్యం రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.