అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ
అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్ట
సిద్దిపేట అర్బన్,మేజర్ న్యూస్ :
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. హైమావతి అర్హులైన 14 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల ధ్రువపత్రాలను పంపిణీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా ధూల్‌మిట్ట మండలం జాలపల్లి గ్రామానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఈ ధ్రువపత్రాలను అందజేశారు. ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడంలో గృహ నిర్మాణ పథకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
అనంతరం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హైమావతితో సమావేశమై పలు సమస్యలపై చర్చించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు, ప్రజలకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించినట్లు తెలిసింది.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, సర్పంచులు కరుణాకర్, కొమ్ము రవి, కొమ్ము నర్సింగరావు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
సూర్య న్యూస్ : సిద్దిపేట అర్బన్, - దేవులపల్లి భూపతి