*కాజిపల్లి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి*
జిన్నారం;గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో పారిశ్రామిక ప్రాంతమైన కాజిపల్లి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఏడో వార్డు కౌన్సిలర్ రైసా బేగం, కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పారిశ్రామిక కాలుష్య ప్రభావం ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న గ్రామస్తులకు సురక్షితమైన తాగునీరు అందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించి, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, తాగునీటి ఇబ్బందులు తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యుడు వాహెబ్, సురేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.