*వరంగల్ డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.. రుణమాఫీ ఎక్కడ?*
కోహిర్;రైతాంగానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్–తెలంగాణ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో తహసీల్దార్ కార్యాలయం’ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ మల్లేశంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమానికి సంబంధించిన 12 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.వరంగల్ డిక్లరేషన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని భారతీయ కిసాన్ సంఘ్–తెలంగాణ నాయకులు గుర్తుచేశారు. అయితే రుణమాఫీ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమలు కాలేదని వారు విమర్శించారు. అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ వర్తింపజేసి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతులకు స్పష్టతనిస్తూ, అర్హులైన ప్రతి రైతుకు న్యాయం చేయాలని కోరారు.వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు మద్దతు ధరపై క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. రైతుభరోసా పథకాన్ని అమలు చేయాలని, భూమిలేని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. రైతుబీమా మొత్తాన్ని పెంచి రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.పెరుగుతున్న విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు, వ్యవసాయ పెట్టుబడి ఖర్చులతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పంటలకు సరైన ధరలు లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు సాగుకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు.పోడు, అసైన్డ్ భూములకు అర్హులైన రైతులకు హక్కులు కల్పించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హమైన భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని కోరారు. భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని నివారించాలని పేర్కొన్నారు.అలాగే సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచాలని, వ్యవసాయ భూములకు వెళ్లేందుకు సరైన రహదారులు కల్పించాలని డిమాండ్ చేశారు. సాగునీరు, విద్యుత్, భూముల హక్కులు, పంటల ధరలకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.రైతులకు ఇచ్చిన హామీలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, వాటి అమలుకు కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని భారతీయ కిసాన్ సంఘ్–తెలంగాణ నాయకులు డిమాండ్ చేశారు. పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ, పంటలకు ఆశించిన ధరలు లభించని పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రుణమాఫీ, రైతుభరోసా, గిట్టుబాటు ధర, సాగునీరు తదితర అంశాల్లో స్పష్టమైన చర్యలు చేపట్టి, అర్హులైన రైతులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కోశాధికారి మాణిక్ రెడ్డి, కోహీర్ మండల కన్వీనర్ వేమారెడ్డి, కో కన్వీనర్ రమేష్ యాదవ్, శ్రీనివాసరెడ్డి, నర్సింలు, మధు భూపాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.