ఏపీ హై కోర్టులో జస్టిస్ అవినాష్ సోమకాంత్ బాటే సంతాప సభ
అమరావతి :జస్టిస్ అవినాష్ సోమకాంత్ బాటే న్యాయ సేవలు శ్లాఘనీయమని, ఆయన సూక్ష్మ పరిశీలనతో కేసులు పరిశీలించిన విధానం యువ న్యాయవాదులకు ఆదర్శనీయమని ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన దివంగత జస్టిస్ అవినాష్ సోమకాంత్ బాటే సంతాప సభ సోమవారం మొదటి కోర్టు హాల్ లో నిర్వహించారు.ముందుగా జస్టిస్ అవినాష్ సోమకాంత్ బాటే మృతికి సంతాప సూచకంగా ఫుల్ కోర్టు నిమిషం మౌనం పాటించి ఘన నివాళులర్పించింది.జస్టిస్ బాటే కుటుంబ సభ్యులకు కోర్టు హాల్ లో నిర్వహించే సంతాప సభ కార్యక్రమాన్ని వర్చువల్ గా పాల్గొనేలా అవకాశం కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఏపీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్ మాట్లాడుతూ జస్టిస్ అవినాష్ సోమకాంత్ బాటే 25 నవంబర్ 1937 సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించారని తెలిపారు.చిన్నతనం నుండి జస్టిస్ అవినాష్ సోమకాంత్ బాటే చదువులోనూ,ఆటల్లోనూ చురుకైన విద్యార్థిగా గుర్తింపు పొందారని అన్నారు.ముఖ్యంగా క్రీడల్లో క్రికెట్,హాకీ,టెన్నిస్ లపై మక్కువ చూపేవారని గుర్తు చేశారు. ఆయన మహారాష్ట్రలో న్యాయవాదిగా మరియు జ్యుడీషియల్ సర్వీసెస్‌లో కెరీర్‌ను ప్రారంభించారని తెలిపారు.ఆయన చట్టపరమైన పరిజ్ఞానాన్ని గుర్తించి 1994 అక్టోబరు 6న బొంబాయి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించడం జరిగిందన్నారు.అదే ఏడాది బదిలీపై 1994 నవంబరు 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారని,1996 జూన్ 3న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు.ఉమ్మడి ఏపీ హైకోర్టులో తన పదవీ కాలంలో డివిజన్ బెంచ్ మరియు సింగిల్ జడ్జిగా వేలాది కేసులను పరిష్కరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు.1999 నవంబరు 25న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయడం జరిగిందన్నారు.రిటైర్మెంట్ తర్వాత జస్టిస్ అవినాష్ సోమకాంత్ బాటే 'మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్' (MAT) ఔరంగాబాద్ బెంచ్ వైస్ చైర్మన్‌గా రెండేళ్ల పాటు సేవలు అందించారని తెలిపారు.జస్టిస్ అవినాష్ సోమకాంత్ బాటే కేసు రికార్డులను అత్యంత క్షుణ్ణంగా పరిశీలించడంలో, నిష్పాక్షికతతో వ్యవహరించడంలో మరియు న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని స్మరించుకున్నారు.
అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ అడ్వకేట్ అసోసియేషన్ ప్రసిడెంట్ ప్రభునాథ్ వాసిరెడ్డి లు జస్టిస్ అవినాష్ సోమకాంత్ బాటే న్యాయ ప్రస్తానాన్ని స్మరించుకుంటూ ఆయన చూపిన బాట అందరికీ ఆదర్శనీమని కొనియాడారు. ఈకార్యక్రమంలో ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. లక్ష్మీనారాయణ,ఏపీ బార్ కౌన్సిల్ ఛైర్మన్ బాలాజీ,బార్ కౌన్సిల్ ప్రతినిధులు,ప్రభుత్వ సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.