సూర్య, మందమర్రి : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని మందమర్రి పోలీస్‌స్టేషన్‌లో స్థానిక పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌ఐ గోపతి నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి పోలీసు విధివిధానాలపై అవగాహన పొందారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పనితీరు, రిసెప్షన్ డెస్క్, మహిళా సహాయ కేంద్రం, కేసుల నమోదు ప్రక్రియ, లాకప్ గదుల గురించి పోలీసు సిబ్బంది వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషించే పాత్రను, మహిళలు, బాలబాలికల రక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లను తెలియజేశారు. విధి నిర్వహణలో పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను పరిచయం చేసి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకోవాలని, విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలపై గౌరవం పెంపొందించుకుని క్రమశిక్షణతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలతో పోలీసు వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన పెరగడంతోపాటు, పోలీసుల పట్ల భయాలు తొలగి గౌరవభావం ఏర్పడుతుందని ఎస్‌ఐ నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.