కూటమికి ధరల మంట!...
విజయనగరం బ్యూరో, సూర్య : పెరుగుతున్న నిత్యావసరాల ధరలు జిల్లాలో కూటమి అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన లోలోపల కలవరపరుస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా అన్నిరకాల నిత్యవసరాలపై పడింది. ధరలు రోజుకోరీతిన హదలెత్తిస్తున్నాయి. వంటింటి బడ్జెట్ అమాంతం రెండురెట్లు పెరిగిపోయింది. సామాన్యుల బ్రతుకు చిత్రంకూడా మారుతోంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం కొనేటట్టు లేదనే మాట అందరినోటా వినిపిస్తోంది. సంపన్నుల సంగతి పక్కనపెడితే, పేద, మధ్యతరగతి వర్గాలు మాత్రం చితికిపోతున్నాయి. పచారీ సామాన్లకోసం అంగడికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కూటమి అభ్యర్థుల ఆందోళనకు ఇదే కారణం. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలవల్ల కూటమి అభ్యర్ధులపట్ల కొంత మొగ్గు కనిపిస్తున్నప్పటికీ, ధరల మంట గుర్తొచ్చి దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చెబుతున్నారు. నిజానికి, ధరలు ఆకాశాన్ని అంటడంతో సర్కారుకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదు. ఎల్ నినో బూచిచూపి కృత్రిమ కొరత సృష్టిస్తూ వ్యాపారవర్గాలు ధరలను మెల్లమెల్లగా ఆకాశానికి చేర్చుతున్నాయి. అయితే, దీనిపై కొరడా ఝళిపించి వాటిని అదుపులో ఉంచేలా చూడడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు అన్నివర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలోని సంబంధిత అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడంలేదు. వారినుంచి కనీస స్పందన కూడా లేకపోవడంపై మార్కెట్ వర్గాలతో చేతులు కలిపారా అన్న అనుమానాలు సహజంగానే కలుగుతున్నాయి. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించుకోవడం సముచితం. ఎల్ నినో సమస్య ఈ జిల్లాకో, ఈ రాష్ట్రానికో పరిమితం కాదు. మనదేశమే కాకుండా మరిన్ని దేశాలు కూడా ఎల్ నినో దెబ్బకు అల్లాడుతున్నాయి. ధరల పెరుగుదల మాట అటుంచితే, తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. రెసిడెన్షియల్ విద్యాసంస్థలు సైతం మూతపడుతున్నాయి. కొన్నిచోట్ల తాగునీటికి రేషన్ విధానం అమలు చేస్తున్నారు. సగం దేశాలు ఎల్ నినో కి ప్రభావితమైనట్టు ప్రపంచ దేశాల్లోని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఐతే, సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఇదేమీ తెలియదు. తెలిసినా పట్టించుకునే అవగాహన కూడా ఉండే అవకాశం లేదు. కాగా, ఇదే అదనుగా రాష్ట్రంలోని విపక్షాలు మాత్రం ఎన్నికల ప్రచారంలో ధరల పెరుగుదల అంశాన్ని ప్రధానాంశంగా మార్చాయి. వైసీపీ నేతలు ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించి రాజకీయ లబ్దిపొందేందుకు తెగ తాపత్రయపడుతున్నారు.ఈ ప్రచారానికి కొన్నివర్గాలు ప్రభావితం కానప్పటికీ, దిగువ మధ్యతరగతి వర్గాలు మాత్రం అసలు కారణం తెలియక ధరలు పెరుగుదలపై మండిపడుతున్నారు.
మొత్తంగా పరిస్థితి పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణసంకటంగా మారింది. అయితే, కూటమి వర్గాలు మాత్రం లోన ఎలాఉన్నా బైటకు మాత్రం ధరల పెరుగుదల అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ప్రజలు వాస్తవాన్ని తెలుసుకోవడంవల్ల అలజడి కనిపించలేదని చెబుతున్నారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.