25వ వార్డులో బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు అల్లిపురంలో కూటమి నాయకుడు బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా , 25వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి డక్కా రవణమ్మలకు అందరూ ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తారక్ నాథ్ రెడ్డి ఓటర్లను కోరారు. ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్బంగా గత యాభై సంవత్సరాలుగా తమ తాత డాక్టర్ బొమ్మిరెడ్డి సుందర రామిరెడ్డి, తమ తండ్రి డాక్టర్ బొమ్మిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అందించిన వైద్య సేవలు, ప్రజా సేవకు, సామాజిక సేవలను ఆయన గుర్తుచేశారు. తమ తల్లి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా అందిసున్న వైద్య, సామాజిక సేవలను ఆయన వివరించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలిసినవేనని, కళ్ళముందు కనిపించేవేనని ఆయన పేర్కొన్నారు. అన్నింటిని గుర్తించి అందరూ ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేసి విజయం చేకూర్చాలని, తమవంతు వైద్య సేవలతో పాటు ప్రభుత్వం ద్వారా మంత్రి ఆనం సహకారంతో ప్రజా సేవలందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగించారు.