కెనాల్ గట్టుపై చెట్టు నరికివేత.. రూ.16 వేల జరిమానా !
సూర్య, లక్షెట్టిపేట : అనుమతులు లేకుండా చెట్టును నరికివేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. అటవీ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు బిరుదుల చిన్నరాజు తండ్రి రాజ నరసయ్యకు చెందిన భూమి సమీపంలోని కెనాల్ గట్టుపై దురుషణం చెట్టును నరికివేసినట్లు గుర్తించారు. ఈ మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు నరికివేసిన చెట్టుకు కొలతలు తీసి, దాని విలువను రూ.5,412గా నిర్ధారించారు. అటవీ నిబంధనల ప్రకారం రూ.16 వేల జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో లక్షెట్టిపేట అటవీ సెక్షన్ అధికారి అల్తాఫ్ హుస్సేన్, ఫారెస్ట్ బీట్ అధికారులు చంద్రశేఖర్, సుమలత పాల్గొన్నారు.