ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధం: మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
పోలాకి, సూర్య : ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుడి ఓటు అత్యంత కీలకమైనదని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. మండల పరిధిలోని మబాగం గ్రామంలోని 47వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఆయన కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధర్మాన కృష్ణదాస్ తన సతీమణి పద్మప్రియ, కుమారుడు ధర్మాన రామలింగం నాయుడు, కోడలు శ్రావణితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకుని, సాధారణ ఓటర్ల మాదిరిగానే క్యూ లైన్‌లో వేచి ఉండి ఓటు వేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల వేలికి ఉన్న సిరా గుర్తును ప్రదర్శిస్తూ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఈ పవిత్రమైన హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.