కొండపాక జిహెచ్ఎస్ లో పేరెంట్స్ టీచర్ మీటింగ్
కొండపాక : కొండపాక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, క్రమశిక్షణ, వ్యక్తిగత అభివృద్ధి గురించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి చర్చించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూక్య విట్టల్ నాయక్ తెలిపారు. సమావేశంలో విద్యార్థుల పరీక్షల ఫలితాలు, సబ్జెక్టుల వారీగా మార్కులు, అభ్యసన సామర్థ్యాన్ని తల్లిదండ్రులకు వివరించారు. పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారా లేదా అనే విషయంపై సమీక్షించారు. చదవడం, రాయడం, గణితం వంటి అంశాల్లో వెనుకబడిన విద్యార్థినులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా క్రమశిక్షణ, ప్రవర్తన, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడం గురించి తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ఇంటి వద్ద పిల్లల చదువును ఎలా పర్యవేక్షించాలో తల్లిదండ్రులకు వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రతిరోజూ పిల్లలను పాఠశాలకు పంపించడం, పిల్లలు గైర్హాజరైతే ఉపాధ్యాయులకు తెలియజేయడం, ప్రతిరోజూ పాఠశాలలో ఏమి నేర్చుకున్నారో అడగడం, ఇంటి వద్ద ప్రతిరోజూ చదువుకునేలా చేయడం, ప్రతి పేరెంట్ టీచర్స్ మీటింగ్ కి హాజరవ్వడం, నెలకు ఒకసారి ఉపాధ్యాయులను కలిసి పిల్లల ప్రగతిని తెలుసుకోవడం లాంటి ఆరు విద్యా సంబంధిత ప్రతిజ్ఞలను తల్లిదండ్రులకు సూచించారు. ప్రతి విద్యార్థి అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని, పాఠశాల తల్లిదండ్రుల సమన్వయంతోనే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని హెచ్ఎం, ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పిటీఎం అనేది కేవలం సమావేశం కాదని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి చేసే ఒక మంచి ప్రయత్నమని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.