ఇంట్లోకి చొరబడి దాడి... ముగ్గురు నిందితులకు రిమాండ్
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 26) మొబైల్ ఫోన్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను షాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. షాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 22న రాత్రి సుమారు 9 గంటలకు షాబాద్ మండలం నాగర్‌గూడలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేగడి దోస్వాడ గ్రామానికి చెందిన వ్యాపారి ఆర్డా శ్రీనివాస్‌రెడ్డి (38) ఇంట్లోకి ఆయన డ్రైవర్ ఖలీల్, అతడి బావమరిదులు ఆదిల్ (23), అద్నాన్ (22) అక్రమంగా ప్రవేశించి కర్రలతో దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌రెడ్డితో పాటు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులు, ఆయన సోదరుడు శేఖర్‌రెడ్డి గాయపడ్డారు.ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన షాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు ఖలీల్, ఆదిల్, అద్నాన్‌లను అరెస్టు చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించిందని పోలీసులు తెలిపారు.