ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి..
సంగారెడ్డి, ప్రతినిధి :-- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన కుటుంబాల వివరాలను నూతన విధివిధానాల ప్రకారం ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.గురువారం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు చేపట్టాల్సిన చర్యలు, నమోదు ప్రక్రియపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రదేశాల్లో నమోదు శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ నుంచి శిబిరాల ద్వారా బీమా వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని తెలిపారు. శిబిరాల నిర్వహణ, నమోదు ప్రక్రియపై ప్రజలకు ముందస్తు సమాచారం అందేలా టామ్టామ్తో పాటు ఇతర సమాచార మాధ్యమాల ద్వారా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని తెలిపారు.పథకం నమోదు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించనున్నందున అధికారులు, ఆపరేటర్లు పూర్తి అవగాహనతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ సభ్యుల వివరాలు, నామినీల వివరాలు, వయస్సు, కుటుంబ సభ్యులతో ఉన్న బంధుత్వ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలన్నారు. నమోదు ప్రక్రియ చేపట్టే ఆపరేటర్లకు ముందస్తు అవగాహన కల్పించాలని, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు శిబిరాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆహార భద్రత కార్డు కలిగిన అర్హుల వివరాలను మాత్రమే నమోదు చేయాలని స్పష్టం చేశారు.ఆహార భద్రత కార్డు నంబర్ ఆధారంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన అనంతరం బీమా చేయించుకున్న వ్యక్తి మొబైల్ ఫోన్కు సమాచారం అందుతుందని కలెక్టర్ తెలిపారు. నామినీ వివరాలు నమోదు చేయాల్సి ఉన్నందున బీమా చేయించుకునే వ్యక్తి స్వయంగా నమోదు శిబిరానికి హాజరై అవసరమైన వివరాలను అందించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే నామినీలు శిబిరానికి హాజరుకావాల్సిన అవసరం లేదని తెలిపారు.నమోదు చేసిన ప్రతి దరఖాస్తు వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు, ఆన్లైన్లో పొందుపరిచిన వివరాలకు అనుగుణంగా రికార్డులను నిర్వహించి భద్రపరచాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డీపీఓ మల్లారెడ్డి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, సిపిఓ గీత, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఈడీఎం ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.