telangana
హైదరాబాద్‌లో క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు
హైదరాబాద్: నగరంలోని పలు క్లౌడ్ కిచెన్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. తెలంగాణ సేఫ్ ఫుడ్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ సోదాల్లో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఆహారాన్ని తయారుచేసే ప్రాంగణాల్లో అపరిశుభ్ర వాతావరణం నిండి ఉండటంతో పాటు ఆహార భద్రతా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు.
ఈ తనిఖీల సందర్భంగా నిషేధిత, హానికర రసాయనాలతో కూడిన 15 బాక్సుల ఫుడ్ కలర్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని పలు క్లౌడ్ కిచెన్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, మరికొన్నింటికి తక్షణమే పరిశుభ్రత ప్రమాణాలు మెరుగుపరచుకోవాలని ఆదేశిస్తూ ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు అందించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని కిచెన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.