telangana
స్థానిక కళాకారుల ప్రతిభకు ‘కురేన్ ఘాట్’ సినిమా నిదర్శనం
సూర్య, మందమర్రి : స్థానిక కళాకారుల సృజనాత్మకతకు, ప్రతిభకు ‘కురేన్ ఘాట్’ సినిమా అద్దం పడుతోందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న యధార్థ సంఘటన ఆధారంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాకారులు రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘కురేన్ ఘాట్’ సినిమా పోస్టర్‌ను మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షుడు రాకం సంతోష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సినిమా నిర్మాణ రంగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు ముందుకు రావడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రాంతానికి చెందిన కళాకారులు కలిసి సినిమా రూపొందించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రయత్నాలకు ప్రజల ప్రోత్సాహం ఎంతో అవసరమని, మన ప్రాంత కళాకారులు తెరకెక్కించిన చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. కళాకారులకు తమ వంతు సహకారం, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. కాగా, ఈ చిత్రానికి మంచిర్యాల జిల్లాకు చెందిన దొబ్బల శంకర్ నిర్మాతగా వ్యవహరించగా, దుర్గం విజయ్ దర్శకత్వం వహించారు. శ్రీమాన్ హీరోగా, తోట మహేష్ విలన్‌గా నటించారు. వేణు సంగీతాన్ని అందించగా, లక్కీ లక్ష్మణ్ కొరియోగ్రాఫర్‌గా, రమేష్ రాజా ఫైట్ మాస్టర్‌గా, కంపెల శ్రీనివాస్ మాటల రచయితగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుదీప్, సీనియర్ డ్యాన్స్ మాస్టర్ రిథమ్ సది, నమ్రిత్, గౌరీష్, గిరి, యూత్ కాంగ్రెస్ నాయకుడు ముడారపు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.