చిన్నారుల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాది!
బాడంగి, సూర్య : చిన్నారుల సమగ్ర అభివృద్ధికి పౌష్టికాహారం, నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకమని బాడంగి ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్. సుజాత అన్నారు. బాడంగి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన ‘పోషణ్ భీ పఢాయి భీ’ రెండో విడత రెండు రోజుల శిక్షణ మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా చిన్నారుల వయస్సుకు తగిన బోధనా పద్ధతులు, ఆటపాటలతో విద్యాబోధన, పోషకాహారం, ఎదుగుదల పర్యవేక్షణ, పోషణ్ ట్రాకర్ వినియోగంపై సూపర్వైజర్లు ఎస్.కె. గౌరమ్మ, వై.వి. నాగమణి, ఏ. శ్రీదేవి అవగాహన కల్పించారు. చిన్నారుల్లో అభివృద్ధి లోపాలను తొలిదశలో గుర్తించి, శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కేంద్రాల్లో సమర్థంగా అమలు చేయాలని సీడీపీఓ సూచించారు. మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.