telangana
మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు - జిల్లా కలెక్టర్ కె.హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం జిల్లాలోని రెబ్బెన మండలం నంబాల గ్రామంలో ఇంద్ర మహిళా శక్తి సమాఖ్య ఆధ్వర్యంలో 6 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 2 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ సుమారు 10 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి విక్రయించడం ద్వారా యూనిట్‌కు 3.31 రూపాయల చొప్పున ఆదాయం సమకూరుతుందని తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం మహిళల ఆర్థిక స్వావలంబనకు, సంఘాల ఆర్థిక బలోపేతానికి దోహదపడుతుందని తెలిపారు. సోలార్ ప్యానెళ్లపై దుమ్ము, ధూళి పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చని, ప్యానెళ్ల శుభ్రతకు నిరంతరంగా నీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా ప్లాంట్ పరిసరాలలో రెండు బోర్లు వేయించాలని తెలిపారు. ప్లాంట్‌కు విద్యుత్ పరికరాలు, నిర్వహణ సామగ్రి, వాహనాలు సులభంగా చేరుకునే విధంగా రహదారికి అవసరమైన మరమ్మతులు చేపట్టి రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దాలని సూచించారు. నిర్దేశిత సామర్థ్యానికి అనుగుణంగా నిరంతర విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ప్లాంట్ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని, మహిళా సమాఖ్యకు నిరంతర ఆదాయం సమకూరే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహిళా సంఘాలు సంప్రదాయ పొదుపు, రుణ కార్యకలాపాలకే పరిమితం కాకుండా సౌర విద్యుత్ ఉత్పత్తి వంటి ఆదాయాన్ని సమకూర్చే భారీ ప్రాజెక్టులను చేపట్టడం అభినందనీయమని, ఇటువంటి ప్రాజెక్టుల ద్వారా మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో పునరుత్పాదక ఇంధన వినియోగం పెంపొందుతుందని తెలిపారు. సోలార్ ప్యానెళ్లను, విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థను, ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన ఇతర సదుపాయాలను పరిశీలించారు. ప్లాంట్‌కు వెళ్లే రహదారి దెబ్బతిని వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా ఉండటాన్ని గమనించి, ప్లాంట్ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఉత్తమ్ జాడే, ఇంద్ర, గౌతమి, జంగుబాయి, తిర్యాణి, ఆసిఫాబాద్ మండల సమాఖ్యలకు చెందిన మహిళా శక్తి సమాఖ్య సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.