andhrapradesh
నాగుల చవితి రోజున పెద్ద శేష వాహనంపై శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపు
తిరుమల: పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 13వ తేదీ రాత్రి తిరుమల మాడ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. ఈ మేరకు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవ వైభవంగా సాగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రజాసంబంధాల అధికారి తెలిపారు.
సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా విశేష సేవలందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడైన ఆదిశేషువు, త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా శ్రీనివాసుడికి నిత్య సన్నిహితుడిగా నిలిచారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారు శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయుడిగా నిత్య పూజలు అందుకుంటున్నారు.
దాసభక్తికి నిలువుటద్దంగా నిలిచే తన ప్రియ భక్తుడైన ఆదిశేషుడిపై శ్రీదేవి, భూదేవి సమేతుడై విహరించే మలయప్ప స్వామివారు భక్తులకు అభయమిస్తూ శరణాగతి ప్రపత్తిని సాక్షాత్కరింపజేస్తారని అర్చకులు తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాల వాహన సేవల్లో సైతం తొలి ప్రాధాన్యత పెద్ద శేష వాహనానికే దక్కడం విశేషం.