పటాన్‌చెరులో అభివృద్ధి పనులకు అడుగు పడలేదు
పటాన్‌చెరు:కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా పటాన్‌చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కనీసం అడుగు కూడా పడలేదని, తట్టెడు మట్టి సైతం తీయలేదని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజల సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు. శివనగర్ నుంచి పెద్ద కంజర్ల వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు కావస్తున్నా నియోజకవర్గంలో కనీసం ఒక్క అభివృద్ధి పనైనా చేపట్టలేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.అధ్వానంగా మారిన రోడ్లతో స్థానిక ప్రజలు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. శివనగర్ నుంచి పెద్ద కంజర్ల వరకు రోడ్డు నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ నిరసన దీక్షలో బీజేపీ జిన్నారం మున్సిపాలిటీ అధ్యక్షుడు జగన్ రెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.